పారుపల్లి శ్రీ రంగనాథ్
 

 

తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వేంకటేశ్వర కళాపీఠంలో, సభారంజని విభాగానికి, శిక్షణ మరియు ప్రదర్శనా రంగంలో కళాకారునిగా ఎంపిక కాబడి పేరొందిన సంగీత సద్గురువుల పర్యవేక్షణలో సుశిక్షణ పొందిన శ్రీ పారుపల్లి రంగనాథ్, గాయకులుగా, అన్నమయ్య సంకీర్తనా ప్రచార మహోద్యమంలో భాగంగా కొన్ని వేల సంకీర్తనా గానకచేరీలు నిర్వహించారు. ఉత్తమ సంకీర్తనా గాయకునిగా రసజ్ఞ శ్రోతల మన్ననలందుకున్నారు.

పెదనాన్నగారైన గాయక సార్వభౌమ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారు ఆంధ్రదేశంలో కర్ణాటక సంగీత సుస్థిరతకు నాంది పలికిన మహామనీషి. ఆ పారుపల్లి వంశాన, శ్రీమతి కామేశ్వరమ్మ, గాన సరస్వతి శ్రీ పారుపల్లి సత్యనారాయణ దంపతులకు జన్మించిన శ్రీ రంగనాథ్ జన్మతః లభించిన గాత్ర మాధుర్యాన్ని రంగరింపజేసుకుని, చిన్నతనం నుంచి సంగీతం పట్ల అభిలాషతో విజయవాడ ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కలియుగ దైవమై విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వరునిపై గోవింద నామాలను స్వరపరిచి (శ్రీనివాసా గోవిందా, శ్రీ వేంకటేశా గవిందా) భక్త హృదయాలలో సుస్థిర పరిచారు. కొన్ని వేల భక్తి సంకీర్తనల ఆడియో క్యాసెట్లలో పాడిన శ్రీ రంగనాథ్ ఆడియో రంగంలో పేరొందిన గాయకునిగా ప్రసిద్ధిపొందారు.

మాజీ ప్రధాని కీ.శే. పి.వి.నరసింహారావు, గవర్నర్ డా. సి. రంగరాజన్, కీ.శె. మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు వంటి ఎందరో ప్రముఖుల ప్రశంసలు పొంది దేశ విదేశాలలో ఎన్నో సత్కారాలందుకున్నారు. ఆస్టేలియాలోని మెల్ బోర్న్, సిడ్నీ, ఈస్ట్ ఆఫ్రికా దేశంలోని కెన్యా, నైరోబి, ఉగాండా మరియు మారిషస్ మొదలైన దేశాలు పర్యటించి అన్నమయ్య సంకీర్తనల వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తున్న శ్రీ పారుపల్లి రంగనాథ్, గత 23 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం, అన్నమాచార్య ప్రాజెక్ట్ లో, గ్రేడ్ - 1 స్థానంలో, సీనియర్ గాత్ర కళాకారులుగా శ్రీవారి సేవలో ఉన్నారు.

గౌరవ పురస్కారాలు - బిరుదులు:

 • విశిష్ట సేవా రత్న గ్రహీత - 2006 తిరుమల తిరుపతి దేవస్థానములచే

 • విశిష్ట రత్న ఉగాది పురస్కారం, 2011, కళామంజరి సాంస్కృతిక సంస్థ విజయవాడ వారిచే   

 • గాన కళారత్న 1983 బిరుదు సత్కారం - కార్వేటి నగర సంస్థానం, కార్వేటి నగరం, చిత్తూరు జిల్లా.

 • సంకీర్తనా తపస్వి బిరుదు ప్రదానం - సంకీర్తన సాంస్కృతిక సంస్థ వారిచే రవీంద్రభారతి, 2010 హైదరాబాద్ లో.

 • సంకీర్తనా గాన పయోనిథి - ఆర్. జె. మీడియా హైదరాబాద్

 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారత రాజధాని న్యూఢిల్లీ లో 1985-89 సంవత్సరములు వరుసగా మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి కీ.శే. ఎన్.టి.రామారావు , మాజీ గవర్నర్ డా. రంగరాజన్ గార్లచే గౌరవ సత్కారాలు

 • కీ.శే. పెండేకంటి వెంకటసుబ్బయ్య మాజీ గవర్నర్ ఆఫ్ బీహార్ వారిచే రాజ్ భవన్ పాట్నాలో గౌరవ సత్కారం

 • శ్రీ రామకృష్ణ మిషన్, హైదరాబాద్ వారిచే సత్కారం - 1986

 • 2008 వ సంవత్సరం కె.ఎల్. యూనివర్సిటీ, విజయవాడ వారి సంగీతోత్సవంలో, మాజీ మంత్రివర్యులు శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారిచే గౌరవ సన్మానం.

 • ఆప్సో, హైదరాబాద్ వారిచే అన్నమయ్య సంకీర్తన కార్యక్రమంలో డా. సి.నారాయణరెడ్డి గారి ద్వారా రవీంద్రభారతిలో గౌరవ పురస్కారం

 • చలనచిత్ర నిర్మాత, డా.డి.రామానాయుదు గారి ద్వారా చిక్కడపల్లి త్యాగరాయగాన సభలో, శ్రీదేవి గారి రచన, తిరుమలేశునికి స్వరాంజలికి సంగిత దర్శకత్వం వహించిన సి.డి. ఆవిష్కరణ మహోత్సవంలో గౌరవ సత్కారం 2011వ సంవత్సరంలో..